తెలంగాణ అంశంపై ఎనిమిది పార్టీలకు కేంద్రం పిలుపు!

తెలంగాణ అంశానికి శాశ్వత పరిష్కార మార్గం కనుగొనే దిశగా కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా వచ్చే నెల ఐదో తేదీన ఎనిమిది రాజకీయ పార్టీలతో చర్చలు జరుపనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఢిల్లీకి రావాలని కేంద్ర హోంశాఖ కబురు పంపింది.

ఈ ఎనిమిది పార్టీలలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, సీపీఐ, సీపీఎంలు ఉండగా, ప్రాంతీయ పార్టీలైన తెలుగుదేశం, ప్రజారాజ్యం, తెలంగాణ రాష్ట్ర సమితి, ఎంఐఎం పార్టీలు ఉన్నాయి. అయితే, ఈ చర్చల్లో లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నట్టు కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ అంశంపై ఈ పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించనున్నాయి. ఆ తర్వాతే కేంద్రం తన స్పష్టమైన వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది.

తెలంగాణ అంశాన్ని విస్తృత స్థాయి చర్చల ద్వారా పరిష్కరించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగానే రాష్ట్రానికి చెందిన ఎనిమిది రాజకీయ పార్టీలను కేంద్రం హోంమంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపింది. జనవరి ఐదో తేదీ మంగళవారం జరిగే సమావేశానికి హోంమంత్రి చిదంబరం అధ్యక్షత వహించనున్నారు.